Read excellent articles on literary fame in USA Mr Chitten raju Vanguri
మానవవాది
Thursday, January 26, 2012
Saturday, April 16, 2011
హేతువాదం – మానవవాదం
Ravipudi Venkatadri -Painting by Giridhar Goud
మానవుణ్ణి గురించి అనాదిగా కొన్ని అభిప్రాయాలుంటూ వచ్చాయి. అవి ఎంత మారినా, మత వాసనలను పొగొట్టుకోలేకపోయాయి. మొత్తం మీద మతాలన్నీ మనిషినీ, అతని చుట్టూ వున్న ప్రకృతినీ, ప్రకృతికి అతీతంగా ఉన్న దేవుడు సృష్టించాడని నమ్ముతాయి. అలా సృష్టి భావాన్నీ, సృష్టికర్త భావాన్నీ పోషించిన మతాలు ఆ నమ్మకానికి ఆధారమేమిటో చెప్పవు. మత గ్రంథాలు చెప్పాయి కాన, నమ్మమంటాయి. సృష్టికర్త గురించి కూడా ఏ మతందారి ఆ మతానిదేకాని, “అతను అలాంటివాడు” అని ఏ మతమూ ఇదమిద్ధమని తేల్చి చెప్పదు. అలాగే మనిషిని దైవాంశంగా భావించారు తప్ప, మనిషి అంటే ఏమిటో వారికి సరయిన అవగాహన లేదు.
కాగా, చార్వాక బౌద్ధాదులూ, సాంఖ్యవైశేషికాది దార్శనికులూ సృష్టి అనేది జరగలేదనే (ఆజాతి) వాదాన్ని వెల్లడించారు. వారిని అనుసరించి గౌడపాదుడు ఆ జాతి సిద్ధాంతాన్ని మరింత వివరించాడు మాండూక్యకారికల్లో, ఆదిశంకరాచార్యుడు తన భాష్యాల్లో దాన్ని మరికొంత వివరించాడు. కానీ, అది అతనికిన్నీ జీర్ణమైనట్లులేదు. అందుకు తగ్గ ఆధారాలు అతని భాష్యాల్లోనే ఉన్నాయి. అంతేకాక, ఆయన శాఖీయులు పౌరాణికులయ్యారు తప్ప, అజాతివాదాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే మాయావాదాన్ని సైతం ఊదరగొట్టడం తప్ప, వారి ఆచరణ దాన్ని వారి విశ్వాసంగా నైనా ధ్రువపరచదు.
ఆధునిక విజ్ఞానం గత 150 సంవత్సరాలుగా మనిషిని గురించి అనేక వాస్తవికాంశాలను పరిశోధించి వెల్లడించింది. చదువుకున్న వారికి చాలా మందికి అవి తెలుసు. అయినా, మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి వారు చదువుకున్న శాస్త్ర పరిజ్ఞానం పనిచేయడంలేదు. వారు సృష్టివాదాన్ని నమ్ముతూనే వున్నారు.
అయితే, ఈ మనిషి ఎలా వచ్చాడు? ఈ ప్రశ్నకు సరైన మార్గంలో సమాధానం చెప్పడానికి దాదాపు 150 ఏళ్లనాడు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో జీవశాస్త్ర విభాగానికి అవకాశం దొరికింది. అంతకు ముందు ఈ విశాల విశ్వంలో నెబ్యులాలు, నక్షత్రాలు, గ్రహాదులు ఎలా ఏర్పడ్డాయో వివరించే పరిణామక్రమాన్ని శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. జీవుల విషయంలో కూడా అలాంటి పరిణామం జరగినట్లు చార్లెస్ డార్విన్ గత శతాబ్ది మధ్యభాగంలో వెల్లడించాడు. ఏ జీవికి ఆ జీవిని దేవుడో, మరొకరో సృష్టించలేదనీ, సూక్ష్మజీవిరాశి నుంచి జరిగిన పరిణామంలో వివిధ, వృక్ష, పక్షి, జంతు జాలాలన్నీ ఏర్పడి, ఆ క్రమంలో ఒక దశలో కోతివంటి జీవరాశి నుంచి మానవుడవతరించాడనీ ఆయన ప్రతిపాదించాడు. దీనికి విశ్వసనీయమైన రుజువులు దొరికాయి. శాస్త్రజ్ఞులంతా దాన్ని ఆమోదించారు. అత్యంత విప్లవకరమైన జీవపరిణామ వాదాన్ని హేతువాదులూ, మానవాదులూ, ఇతర దార్శనికులూ ఆమోదించారు. అనంతరం, నాటి నుంచి నేటి వరకు ఆ పరిశోధనలు కొనసాగుతూనే వున్నాయి. అతి సూక్ష్మాంశాలకు కూడా వివరణలకోసం శాస్త్రజ్ఞులు అహరహం కృషి చేస్తూనే ఉన్నారు. మౌఢ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగాలేని మతస్థులు తప్ప, దేవుడు మట్టి ముద్దనుంచి మనిషిని చేశాడనే వాదాన్ని ఆదరించేవారు లేకుండా పోయారు. అందువల్ల, జంతువు మనిషికి దగ్గర చుట్టమనే విషయం ధ్రువపడింది. అంతకంటే మెరుగైన ప్రతిపాదన మరొకటి రుజువయ్యేదాకా దాన్ని సమ్మతించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అయితే, “మనిషిని జంతు స్థాయికి తీసుకువెళతారా?” అని సణిగినందువల్ల ప్రయోజనం లేదు. “మన తాతలు కోతులా” అని డార్విన్ మీదా, పరిణామవాదుల మీదా గత శతాబ్దంలో మతస్థులు తీవ్రంగా దాడి చేశారు. కారనే దానికంటే ఔననే దానికే ఎక్కువ బలం చేకూరింది. దేవుణ్ణి వదలుకోలేనివారు “మనిషిని ఎవరు సృష్టించారు?” అనే ప్రశ్నను వదలి, “ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు?” అనే ప్రశ్నను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే, అజ్ఞానంలో దేవుణ్ణి కనుక్కోవడం మతస్థుల ఆనవాయితీ.
కొన్ని అంశాల విషయంలో నేడు లేబొరేటరీలలో కృత్రిమంగానే పరిణామాన్ని సాధిస్తున్నారు. సంకర జాతులను ఉత్పత్తి చేస్తున్నారు. జన్యువులను మారుస్తున్నారు. “వృక్ష-జంతువులను”, “జంతు-మానవులను” సృష్టించే స్థాయికి చేరుకున్నారు. “నూతన జాతుల” సృష్టి అసంభవం కాదని తేలిపోయింది. సృష్టి అంటే ఏమీ లేకుండానే “శూన్యం” నుంచి దేన్నో బయటకు తీయడమనే అర్థం మారిపోయింది. ఉన్న పదార్థం నుంచి భిన్న ధర్మాలుకల వస్తువుల్ని (జీవుల్ని) తయారు చేయడమే “సృష్టి” అనే అర్థం నెలకొన్నది. నిజానికి ఏమీలేని దానినుంచి దేనినీ సృష్టించలేము. Something cannot be created out of nothing.
మనుషులకున్నట్లే జంతువులకున్నూ పంచేంద్రియాలున్నాయి - ముక్కు, కన్ను, చెవి, నాలుక, చర్మం. అలానే జననేంద్రియాలూ, ఇతర అవయవాలూ ఉన్నాయి. మనుషుల్లో పనిచేసినంత చురుకుగా పనిచేయక పోయినా, జంతువులకూ మెదళ్ళున్నాయి. అవయవ నిర్మాణాన్నిబట్టి వాటి వాటి ప్రత్యేకతలు వాటి వాటికున్నాయి. కొన్ని గ్రంథులు కొన్ని జంతువుల్లో పనిచేసినంతగా మనుషుల్లో పనిచేయవు. ఉదా. రాబందులు డజన్ల కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న జంతు శవాలను ఆనవాలు పట్టగలవు. మనిషి అవయవ నిర్మాణంలోని ప్రత్యేకతలవల్ల, అతని శక్తి యుక్తులు, ప్రవర్తన మిగతా జంతుజాలంలోని వాటికంటే భిన్నంగాను, అధికంగాను ఉన్న మాట నిజం. అంతమాత్రాన మనిషిని ఈ లోకానికి సంబంధించిన వాడుగా పరిగణించక, అతనిలో “ఏదోవుంది. అది అనిర్వచనీయం” అని వర్ణించబూనితే, అది మతం నేర్చిన పాఠాలను అప్పగించడమే అవుతుంది. మనిషిలో జంతు వారసత్వాన్ని చూచినంత మాత్రాన మనిషి ఆధిక్యతను తక్కువగా అంచనా వేసినట్లు కాదు. మనిషిని జంతువన్నట్లు కాదు. మనిషి అనన్యతను (Uniqueness) కాదన్నట్లు కాదు. నిజానికి దేని అనన్యత దానిదే. ప్రతి జంతువూ ఒక జాతిది ఉన్నట్లు మరొక జాతిది ఉండదు. అలాగే, ప్రతి జీవిన్ని – మనిషి మనిషే. సందర్భాన్ని బట్టి మనిషిలోని జంతు వారసత్వాన్ని గుర్తుకు తెచ్చుకొన్నంత మాత్రాన, మనిషిలోని “మానవతను” కించపరిచినట్లు కాదు. వాస్తవికతను ఆమోదించినట్లవుతుంది.
నిర్జీవ పదార్థంతో తయారుచేసిన కృత్రిమ అవయవాలను మనిషి దేహంలో బిగిస్తే, అవి మామూలు అవయవాలవలెనే పనిచేస్తున్నాయి. నిర్జీవ పదార్ధాలైన లవణాలు తీసుకుంటే, అవి మన శరీరంలో భాగాలయిపోతున్నాయి. మత్తుమందులద్వారా మనిషిని బుద్ధిహీనుణ్ణి చేయవచ్చు. అంటే, జంతువు నుంచి మనిషిని వేరు చేస్తున్న ఒక విశిష్ట లక్షణాన్ని అతని నుంచి తొలగించవచ్చు. మానసిక రుగ్మతను (ఉన్మాదాన్ని) నయం చేయవచ్చు. అంటే మరల్ని మరమ్మత్తు చేసినట్లే మనుషుల్ని మరమ్మత్తు చేయవచ్చు. అంటే, మనిషి పదార్థేతరం కాదని తేలిపోతున్నది.
సిగ్మండ్ ఫ్రాయిడ్ తో మనోవిశ్లేషణ (Psycho-analysis) కు శాస్త్ర ప్రతిపత్తి చేకూరింది. ఆయన అనంతరం ఈ 60 ఏళ్ళలో అది మరికొంత అభివృద్ధి సాధించింది. అయినా, శైశవ దశలోనే ఉంది. మనో విశ్లేషణ శాస్త్ర్రం మన భ్రమలకు, మత భావాలకు సరైన భాష్యాలు చెప్పుకొనే మార్గం చూపింది. వివిధ శాస్త్రాల ద్వారా మనిషిని గురించి మనం చాలా తెలుసుకున్నాం. తెలిసినది జ్ఞానం, తెలియనిది అజ్ఞానం. తెలియనిది ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఇప్పటి వరకు మనకు తెలియరానిదంతా ఎప్పటికీ తెలుసుకోజాలనిది కాదు. అజ్ఞానమంతా అజ్ఞేయం కాదు. మనిషికున్న మానసిక ప్రవృత్తిలో తమకు అర్థంకాని వాటిని పట్టుకొచ్చి అయోమయంగా “వాటిగురించి ఏమి చెబుతారు” అని ప్రశ్నించడం న్యూరోటిక్ మతవైఖరి. అందుకే, మతాన్ని యూనివర్సల్ న్యూరోసిస్ అన్నాడు ఫ్రాయిడ్. “ఏదోవుంది. అది అనిర్వచనీయం, అజ్ఞేయం” అంటూ అజ్ఞానంలో దేన్నో దాచగోరేది మత వైఖరే. నేర్పితే నేర్చుకోవడం మానవుడి సామాజిక వారసత్వం. కాని, మత వారసత్వం అలాకాదు. ఒక అజ్ఞానాన్ని పారద్రోలితే, మరో అజ్ఞానాన్ని ముందుకు నెట్టి “దీన్ని గురించి ఏమి చెపుతారు?” అని సవాలు విసురుతుంది. అలాంటి ప్రశ్నలు చాలాకాలం క్రిందటే మతస్థులు లేవదీశారు. “రాతిలోకి కప్ప ఎలా చేరింది కొబ్బరికాయలో నీరు ఎవరు పెట్టారు? మల్లెపూవుకు తావి ఎలా అబ్బింది? నెమలికి నాట్యం ఎవరు నేర్పారు? కోకిల కంఠంలో మాధుర్యాన్ని ఎవరు పంపారు? సంధ్యాకాశానికి శోభ ఎవరు చేకూర్చారు? ప్రకృతి రామణీయకతకు మనసు ఎందుకు పరవశమవుతుంది?” ఇలా ‘యక్ష’ ప్రశ్నలు వేశారు. కుతూహలం ఉంటే, వీటికి సమాధానాలు తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు.
మనిషికి కొన్ని విశిష్ట లక్షణాలున్నమాట నిజమే. మనిషి నవ్వగలడు. ఏడ్వగలడు, మాట్లాడగలడు. ‘ఆకాశానికి’ నిచ్చెనలు వేయగలడు. గృహనిర్మాణాలు చేయగలడు. మరెన్నెన్నో చేయగలడు. జీవ జాతుల్లో మానవుడికి తప్ప వేటికీ ఈ పనులు సాధ్యం కాని మాట నిజమే. కాని, తన అవయవ నిర్మాణంలోని విశిష్టత వల్లనే మనిషి ఈ పనులన్నీ చేయగల్గుతున్నాడు. ఆలోచనా సాధనమైన అతని మెదడు కుడా అవయవమే. ఆలోచన మెదడు యొక్క ప్రవృత్తి. ఇలా అర్థం చేసుకున్నప్పుడు మనిషి కూడా జీవే, జంతువే. అతడొక తరహా వైజ్ఞానిక జంతువు. సాధారణ జంతువుకు భిన్నమైన జంతువు. అందుకే, మనిషిని జంతువు నుంచి విడదీసి ఆలోచిస్తాం. ఈ మానవులంతా సమరస భావంతో సౌఖ్యంగా జీవించడానికి ఒక విధానం కావాలనుకుంటున్నాం. దాన్ని, మానవవాదమంటున్నాం. అలా కాక, మనిషిని కేవలం జంతువుగా పరిగణిస్తే, జంతువాదం (యానిమలిజం) కావాలని అనేవాళ్ళం. మధ్యలో నపుంసక లింగం జంతు – మానవవాదమెందుకు?
జీవ పరిణామ పూర్వ రంగం ప్రకృతి పరిణామం. జీవం ఏర్పడక పూర్వం నుంచీ మనిషి ఏర్పడక పూర్వం నుంచీ ప్రకృతి (విశ్వం) ఉంది. మన అంచనాకు అందిన వేలకోట్ల సంవత్సరాలుగా దాని పరిణామం సాగుతూనే వుంది. చతుర్ధా విస్తృతమైన విశ్వం గురించి ఇక్కడ వివరించుకోనవసరం లేదు. కాని, మనం అంతగా చెప్పుకొంటున్న మనిషి ఈ విశ్వంలో భాగమే. భాగమంటే చాలా క్షుద్రాతిక్షుద్ర భాగమనే అంటాడు జూలియన్ హక్సలే – విశ్వ పదార్థంతోనే, విశ్వ పరిణామంలో భాగంగా, ఈ విశ్వం సంఘటనగా మనిషి ఏర్పడ్డాడు. పదార్థమంతా అణువర్తనమే, అణువు కాకుంటే మరో సూక్ష్మ భౌతిక రూపం యొక్క పరివర్తనం. పదార్థాన్ని ఏ దశలో ఉన్నట్లు ఊహించినా, మనిషి పదార్థానికి భిన్నం కాదు. మనిషి నిర్మాణాన్ని బట్టి అతనిలోని అణువర్తనం ఉంటుంది. పదార్థం నుంచి దాని ప్రవృత్తి (Function) నీ, ధర్మాల (Properties) నూ విడదీసి చూడడం ఆత్మవాదుల (Spiritualist) ధోరణి. ఆ ధోరణిని 2500 ఏళ్ళకు పూర్వమే చార్వాకులు ప్రశ్నించి, ఖండించారు. – దేహ ప్రవృత్తులుగా కాక, జీవమూ-ఆత్మ అనేవి దేహానికి విడిగా ఎక్కడ ఉన్నాయి? అని.
అందువల్ల, మనిషిని ప్రకృతి నుంచి, ప్రకృతిలోని పదార్థం నుంచి, ఏ జీవ జాతుల నుంచి వరిణామం చెందాడో ఆ జీవ జాతుల నుంచి వేరుచేసి చూచేటపుడు ఎంతవరకు వేరుచేయాలో, ఏ ప్రత్యేకతలకోసం వేరు చేయాలో తెలుసుకోకపోతే, అలాంటి మనిషి నుంచి రాబట్టగలిగేది, ఆ మనిషి గురించి చెప్పగలిగేది మానవాదం కాదు. మనిషిని అతని స్థానం నుంచి తొలగించి స్నాప్నిక జగత్తులో తేలియాడేది మార్మిక వాదమవుతుంది కాని, మానవవాదం కాదు.
ఉనికిలేని పరిణతి లేదు. ఉనికి, పరిణతి అవిభాజ్యాలు. మనిషి లేకుండా మనిషితనం లేదు. స్వేచ్ఛ పొందేవాడు లేకుండా స్వేచ్ఛలేదు. మానవుడి ప్రవృత్తుల్లో స్వేచ్ఛకూడా ఒకటి. ఎం.ఎన్.రాయ్ అన్నట్లు “మనిషి స్వేచ్ఛగా ఉండడానికి పుట్టాడుగాని, పుట్టుకతోనే అతను స్వేచ్ఛాజీవిగా పుట్టలేదు. స్వేచ్ఛగా ఉండడం మానవ జీవితసారం. చుట్టుముట్టి ఉన్న ప్రకృతి శక్తులు అతన్ని త్రొక్కివేసి బానిసను చేస్తున్నాయి. అయితే, వాటినుంచి స్వేచ్ఛను పొందగల వనరులను కూడా ప్రకృతి అతనికి కల్పించింది. మనుగడకోసం అతను ప్రకృతితో పోరాడాలి. ఆ పోరాటంలోనే అతను స్వేచ్ఛకొరకు పడే ఆరాటం ఇమిడి ఉంది” అందుకే, మానవ విలువలన్నిటిలోకి ప్రధానమైనది స్వేచ్ఛ. స్వేచ్ఛను పొందడానికి అతను ప్రకృతి సత్యాలను (పరిసర సత్యాలను), తనను గురించిన సత్యాన్ని, ఈ రెంటికీ మధ్య వుండే సంబంధాన్ని తెలుసుకోవాలి. అందుకు అతని జ్ఞానం సహకరించాలి. జ్ఞానం అంటే, వస్తువులు గోచరించగానే మనకు కలిగే సంవేదన. (Sensation) కాదు. ఆ సంవేదనను అర్థవంతంగా అతక కలిగిన హేతుత్వం కావాలి. అందువల్లనే హేతుత్వం, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ అనేవి మానవ విలువలుగా ఒక శ్రేణిలో ఉంటాయి. ఇలా విలువలకు ప్రాధాన్యమిచ్చే చైతన్యం (Consciousness) అడుగడుగునా నైతికతను సంతరించుకుంటుంది. హేతుత్వం అత్యంత ప్రాధమికస్థాయిలో, సహజాత స్థాయిలో ఉన్న జంతుజాతుల్లో విలువలు ఉండవు సరికదా, ఉన్నాయనుకుంటే అవి ఆ స్థాయిలోనే ఉంటాయి.
ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నదంటే, అసలు మనిషిని వదలి, ఊహాలోకంలో తేలియాడడంవల్ల ప్రయోజనం లేదని చెప్పడానికే. మానవస్వభావాన్ని ఇదమిద్ధమని తెలుసుకోకుండా మానవవాదానికి నిచ్చెనలు వేయడం సాధ్యం కాదు.
Subscribe to:
Comments (Atom)
